Content feed Comments Feed

శ్రీసత్యసాయిబాబా కరుణాకటాక్షాలతో 'శాంతిశ్రీ' జంద్యాల వేంకటేశ్వరశాస్త్రిగారు జగద్గురు ఆదిశంకరాచార్య విరచితం శివానందలహరికి తెలుగులో అర్థాన్ని తెలుపుతూ గ్రంధం వెలువరించారు. కార్తీకమాసం సందర్భంగా ప్రతిరోజూ కొన్నిశ్లోకాలను ప్రచురించ సంకల్పించాను.

ఓం నమఃశివాయ
శివశక్తే నమస్తుభ్యం
కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపః
ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతుమే।
శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృదిపున
ర్భవాభ్యాం ఆనంద స్పురదనుభవాభ్యాం నతిరియమ్॥

శివపార్వతులు సర్వకళా స్థానీయులు. శ్రీచక్ర విరాజితులు. వేదసాహితీ మూర్తులు. చంద్రుని కళలు శిరసులపై అలంకరించుకున్నారు. ఒకరి తపఃఫలాలను మరొకరు అందుకొనుచున్నారు. శబ్ధార్ధములవలె కలిసియున్నారు. భక్తుల భక్తికి తగినఫలాలు అనుగ్రహిస్తున్నారు. సర్వప్రాణికోటి ఆత్మపీఠాలపై శివశంకరులై ప్రకాశిస్తున్నారు. వారుసర్వసృష్టికి మంగళస్వరూపులు. ఆత్మవిద్యకు జ్యోతులు. అద్యాత్మభక్తులకు అనుభవానందము ప్రసాదించేవారు. అఖిలజగతికి జననీజనకులైన ఉమామహేశ్వరులకు నమస్సులు.

గాధాప్రవాహం
గళంతీశంభో త్వచ్చరిత సరితః కిల్బిషరజో
దళంతీ ధీకుల్యాసరణిషు పతంతీ విజయతామ్।
దిశంతీ సంసారభ్రమణ పరితాపోపశమనం
వసంతీ మచ్చేతో హ్రదభువి శివానందలహరీ॥

శంభో! మహాదేవా! జగత్పతీ! మేఘాలు జడలుగాగల శివా! భక్తుల ఆర్తి హరించేవాడా! పాపహరా! మహైశ్వర్యధుర్యా! విశ్వాత్మా సౌందర్యమూర్తీ! దేవప్రియా! భక్తజన కల్పకమా! నీచరితం అమృతప్రవాహం.పరమపావనం. శివానందలహరీ! ఇది నీహృదయక్షేత్రాన్ని పండించుకాక!

మహదేవుడు
త్రయీవేద్యం హృద్యం త్రిపురహర మాద్యం త్రినయనం
జటాభారోదారం చలదురగహారం మృగధరమ్।
మహాదేవం దేవం మయి సదనభావం పశుపతిం
చిదాలంబం సాంబం శివమతివిడంబం హృదిభజే॥

చిదాలంబా! సాంబా! నీఘనత వేదాలవల్లనే తెలుస్తుంది. నీరూపం మనోహరం. రాక్షసమాయాశక్తులకు నిలయాలైన త్రిపురాలను జయించావు. దానితో దేహభ్రాంతిని దూరంచేసిన వాడవైనావు. సృష్టికి పూర్వమే ఉన్నావు. సూర్యచంద్రాగ్నులు అనే మూడుమూల తేజస్సులను కన్నులుగా చేసుకున్నావు. ఆకాశమే నీకుజడలు.  ఆజడలే నీకు కిరీటాలు. ఔదార్యమునకు నీది ఆచార్యపీఠం. ఫణిరాజులు మణిహారాలై నిన్నుసేవిస్తుంటాయి. అందమైన హరిణబాల చెలువం చిందిస్తుంటుంది. నీవు మహదేవుడవు. అమరులందరికీ అధిపతివి. నన్ను అత్యంత వాత్సల్యంతో చూచే దయామయుడవు. అనవరతం ఆనందం ప్రసాదించేవాడవు. పార్వతీపతివి. పశుపతివి. పరమపతివి. జ్ఞానమూర్తివి.శివుడవు. కళ్యాణమూర్తివి. నిన్ను సదా నాహృదయచంక్రంలో నిలిపి ఆరాధిస్తూ శివానందలహరిలో ఓలలాడుతుంటాను.

3 comments

 1. Anonymous Says:
 2. A very good start up...Keep going...!!!---Siva Kumar.K

   
 3. బాగుంది, సందర్భోచితంగా. నెనర్లు.

   
 4. SUBRAMANI Says:
 5. It was great work.........Subramani

   

Post a Comment