Content feed Comments Feed

శ్రీకంఠ 
జ్వాలో గ్రస్సకలామరాతిభయదః క్ష్వేళఃకఠంవా త్వయా
దృష్టః కించ కరే ధృతః కరతలే కిం పక్వజంభూఫలమ్।
జిహ్వాయాం నిహితశ్చసిద్ధఘటికా వా కంఠదేశే భృతః
కింతే నీలమణి ర్విభూషణమయం శంభోమహాత్మ న్వద॥

శ్రీకంఠా! శివా! సముద్రమధనవేళ ఉద్భవించిన విశ్వభయంకర విషజ్వాలలను నీసుకుమార నేత్రాలు ఎలావీక్షించగలిగాయి!  శంకరా! ఆవిషజ్వాలలను నీసుకుమార కరాలు ఎలా తాకి పట్టుకోగలిగాయి! చంద్రశేఖరా! దుర్భరమైన ఆకాలకూటవిషాన్ని నీనాలుక ఎలాసహించగలిగింది! అదేదో బెల్లపు‌ ఉండవలె, నేరేడుపండువలె, నోట్లోవేసుకుని చప్పరిస్తున్నావంటే అత్యాశ్చర్యకరం! నీమహిమ వర్ణనాతీతం.

భక్తసులభ
 నాలంవా సకృదేవ దేవ భవత స్సేవానతిర్వా నుతిః
పూజావాస్మరణం కథా శ్రవణమప్యాలోకనం మాదృశామ్।
స్వామి న్నస్థిరదేవతానుసరణాయాసేన కిం లభ్యతే
కావా ముక్తిరితః కుతో భవతిచే త్కిం ప్రార్థనీయం తదా॥

స్వామీ! నీవెంత దయామయుడివి తండ్రీ! నీనామమాహాత్మ్యం ఎంత అని ఎవరు గుర్తింపగలరు? ఒక్కసారి నీనామం ఉచ్చరించినంతమాత్రాన ఎట్టిపాపికైనా పాపాలన్నీ పోగొట్టి పరమపదం ప్రసాదిస్తావు. ఇందుకు అజామీళాదులు సాక్ష్యం.
నీకథలలో ఒక్కటి శ్రద్ధగా శ్రవణం చేసినా చాలు, ఎట్టిమూఢుడికైనా మోక్షం ఇస్తావు. ధృవుడు, తిన్నడు ఇది తెలియజేశారు. ఒక్కసారి అభిషేకం చేసినదానికే హస్తిరాజుకు అపవర్గం అందించావు.

వీరమణి 
కిం బ్రూమ స్తవసాహసం పశుపతే కస్యాస్తిశంభో భవ
ద్ధైర్యంచే దృశమాత్మనస్స్థితిరియం చాన్యైః కథంలభ్యతే।
భ్రశ్యద్దేవగణం త్రసన్మునిగణం నశ్యత్ప్రపంచం లయం
పశ్య న్నిర్భయ ఏకఏవ విహరత్యానంద సాంద్రోభవాన్॥

శివా! రుద్రా! నీవెంత ధైర్యశాలివి, వీరాధివీరుడవయ్యా! ప్రళయకాలంవచ్చి లోకాలు భస్మమయ్యే విస్ఫులింగ జ్వాలాకీలలురేగి, అందు దేవాదులుపడి మలమలమాడి మసైపోతుంటే, ఆవిలయజ్వాలలుచూచి మహాసంయమీంద్రులు సైతం ధైర్యంకోల్పోయి సమాధిస్థితివీడి గడగడ వణికిపోతుంటే, బ్రహ్మాండాలు భాండాలవలె దొర్లి భగభగమండి అగ్నిగోళాలై పఠేలున పగిలి విచ్చిపోతుంటే ఆప్రళయాగ్ని శిఖలలో విశ్వమంతా భస్మమైపోతుంటే, అమరాథినాథులు హడలిపోయి ప్రాణాలు చేతిలోపట్టుకుని పరుగుపెడుతుంటే
నీవు ఒక్కడివిమాత్రం మహాధైర్యంగా నిర్భయంగా వీరవిహారం చేయసాగావు. నీసాహసం, నీధైర్యం, నీస్థైర్యం, నీశౌర్యం ఎవరు ఎంత వర్ణించగలరు? నీకిదే నమోవాకాలు.

0 comments

Post a Comment