Content feed Comments Feed

దీనరక్షకుడు 

అసారే సంసారే నిజభజనదూరే జడధియా
భ్రమంతం మా మందం పరమకృపయా పాతుముచితమ్।
మదన్యః కో దీన స్తవ కృపణ రక్షాతినిపుణః
త్వదన్యః కో వా మే త్రిజగతి శరణ్యః పశుపతే॥

పశుపతీ! సర్వభూతాధిపతీ! శంకరా! నేను నీకథాశ్రవణం చేయలేదు. నీసంకీర్తన వినిపించుకోలేదు. నీనామం స్మరించలేదు. నీపాదపద్మాలకు అభివందనం చేయలేదు. నటరాజా! నీ పరిచర్య చేయలేదు. నీ పాదార్చన నిర్లక్ష్యం చేశాను. నీదాస్యం చిన్నతనంగా భావించాను. నీతో మైత్రిచేయాలనికూడా అనుకోలేదు. నీకు ఆత్మనివేదనం చేయాలనే సంగతే తెలియదు. సాయీశ్వరా! సర్వేశా! సారహీనమైన సంసారచక్రంలో పడి నలిగి నశించిపోతున్నాను. ఎక్కడా గతిలేదని తెలుసుకున్నాను. చిట్టచివరకు నీపాదాలేగతి అని తెలుసుకున్నాను. నీ సన్నిధికి చేరుకున్నాను. నన్ను నీవే చేర్చుకోవాలి. ఇంతహీనాతిహీనుణ్ణి ఎవరు రక్షింపసమర్థులు? సయాసముద్రుడివి, అనాథనాధుడివి, దీనవత్సలుడివి, అర్తరక్షాదక్షా!స్వామీ నీవే శరణం.

అనాథనాథ
ప్రభుస్త్వం దీనానాం ఖలు పరమబంధుః పశుపతే
ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వ మనయోః।
త్వయైవ క్షంతవ్యాః శివమదపరాధాశ్చ సకలాః
ప్రయత్నా త్కర్తవ్యం మదవనమియం బంధుసరణిః॥

శివా! అంబా మనోహరా! త్ర్యంబకేశ్వరా! నీవు దీనజనబాంధవుడవు. చంద్రకళాధరా! జంగమేశ్వరా! అనాథనాథుడవు. దీనరక్షకా! విజ్ఞానవరదాయకా! కొండకోనలలో బతికే అడవిజాతులవారైన పతితులను పావనంచేసేవాడా! పతితపావనా! పరమేశా! కరుణాసముద్రా! నీవు పాపులైన భూతప్రేతగణాలనూ ఉద్ధరిస్తావు.
ఇంతదయామయుడు దేవతాపరిపాలకులలో మరొకడులేడు. పాతకులలో నావంటి ఘోరపాతకుడు లేడు. ఇటువంటివాణ్ణి ఎవడూ రక్షించలేడు. నీవే కాపాడగల సమర్ధుడవు. మా బంధుడవు. దగ్గరున్నవాడిని ఏడిపించి దూరంగా ఉన్నవారిని కాపాడడమనేది ఏమిధర్మం. స్వామీ! శరణాగతులకు రక్షించటం నీకు సహజగుణం. భక్తుల నీకునీవే సాటి.

బ్రహ్మగీతతుడు
 

ఉపేక్షా నోచే త్కింనహరపి భవద్ధ్యానవిముఖాం
దురాశా భూయిష్టాం విధిలిపి మశక్తో యది భవాన్।
శిర స్తద్వైధాత్రం ననఖలు సువృత్తం పశుపతే
కథంవా నిర్యత్నం కరనఖముఖేనైవ లులితమ్॥

శివా! శిష్ట జనావనా! ఆర్యాదేవీప్రియా! నిన్ను ధ్యానించడానికి బుద్ధి నిలవటంలేదు. అపవర్గం అందించే అమృతవరదాతా మంచిపనులు చేయటానికి నామనస్సు మారాము చేస్తున్నది. మదనవైరీ! సర్వాంతర్యామీ! నీకు తెలియనిదేమున్నది. చెడ్డకామం ఎంతప్రయత్నించినా నశించటంలేదు. ఐశ్వర్యప్రదా! విశ్వకళ్యాణగుణా! నాకు అర్థమోహం దూరంకావటంలేదు.

0 comments

Post a Comment