Content feed Comments Feed

పరమానందలహరి 

నరత్వం దేవత్వం నగవస మృగత్వం మశకతా
పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననమ్।
సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ
విహారాస్తకం చేద్ధృదయ మిహకిం తేన వపుషా॥

పార్వతీశా! సర్వలోకాధీశా! సాయీశా! నాకు ముందుముందు ఏజన్మ ప్రసాదిమ్చినా ప్రభుపాదభక్తిరసంతో నిండిన హృదయం ఉండేలా చూడు ప్రభూ! స్వామీ నన్ను నరునిగా, వానరునిగా, రాక్షసునిగా ఎలా పుట్టించినా పరవాలేదు. మృగధరా! మేరుధరా! శశిధరా! శివా! నన్ను కొండగా చేసినా,పక్షిగా చేసినా, వనంలో మృగంగా చేసినా దిగులుపడను. శ్రీకాళహస్తీశ్వరా నన్ను చెట్టుగా, సరోవరంగా, సాలెపురుగుగా ఎలాసృజించినా నొచ్చుకోను. దేహం ఏదైనా హృదయంలో నీపాదపద్మస్మరణానందలహరీ ప్రవాహం నిండుగా ఉండేలా చేయి స్వామీ!

ఆశ్రమాలు 

వటుర్వా గేహీవా యతిరపి జటీవా తదితరో
నరోవా యః కశ్చిద్భవతుభవ కిం తేన భవతి।
యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే
తదీయ స్త్వం శంభో భవసి భవభారం చ వహసి॥

విశ్వేశ్వరా! శంకరా! మానవుడు నిష్టతో బ్రహ్మచర్యాశ్రమంలోని ఎన్నో శ్రమలకోర్చి నియమాలు పాటించి, విద్యావినయశీల సంపన్నుడైనా, సర్వేశ్వరా! గృహస్థాశ్రమంలో అనేక కర్మలు కర్తవ్యాలు యజ్ఞయాగాలు దానాలు ధర్మాలుచేసినా, కైలాసవాసా!  వానప్రస్థుడై పరమనిష్ఠాగరిష్ఠుడై కేవల కైవల్య కాంక్షియైనా, త్రినేత్రా! సన్యాసియై అనేకయోగ విద్యారహస్యాదులు ఎరిగిన పండితుడైనా, మహాదేవా! మనః పద్మం నీకు సమర్పించి శరణాగతి కోరుకోగల భక్తిగలవాడైతేనే ముక్తికి యోగ్యుడౌతాడు. 

వివిధయోగాలు 

గుహాయాం ఘేవా బహిరపి వనే వాద్రిశిఖరే
జలేవా వహ్నౌవా వసతు వసతేః కిం వద ఫలమ్।
సదా యస్యై వాంతఃకరణ మపి శాంభో తవ పదే
స్థితే చేద్యోగో౭సౌ సచ పరమయోగె సచ సుఖీ॥

పరమేశ్వరా! యోగసాధకులు నానాశ్రమలుపడి శరీరాన్ని శుష్కింపజేసి అవస్థలుపడేవారే ఎక్కువగానీ మనోనిశ్చలత కలిగి మనస్సమర్పణ చేసేవారు అరుదుగా ఉన్నారు. శివా! కొందరు పర్వతగుహలలో ఒంటరిగా హఠయోగాభ్యాసంచేసి ఉత్తీర్ణులౌతున్నారు. గంగాధరా! మరికొందరు శీతాకాలంలో గంగాజలాలలో దిగి ఘోరంగా తపస్సుచేస్తున్నారు. మారహరా! ఇంకాకొందరు గ్రీష్మంలో పంచాగ్నిమద్యలో ఒంటికాలుమీదనిలిచి ఘోరతపస్సు చేస్తున్నారు. వామదేవా! నెత్తురు గడ్దకట్టుకుపోయే చలిలో ఆరుబయట మరికొందరు జపం చేస్తున్నారు. వారు తమచిత్త సరోజాన్ని పరమేశ్వరార్పణ చేయాలి అనేది మరచిపోతే వారిశ్రమ అంతా వ్యర్థంకదా. మనఃకమలం మహదేవార్పణం చేసి నిశ్చలమైన భక్తిని ఉపాసించాలి.

0 comments

Post a Comment