Content feed Comments Feed

ఇంద్రియాలు 
మనప్తే పాదాబ్జే నివసతు వచః స్తోత్ర ఫణితౌ
కర శ్చాభ్యర్చాయాం శ్రుతిరపి కథాకర్ణనవిధౌ।
తవధ్యానే బుద్ధి ర్నయన యుగళం మూర్తివిభవే
పరగ్రంధైః కిం వా పరమ శివ జానే పరమతః॥

పరమశివా! సాయిదేవా! జ్ఞానస్వరూపా! నిర్థూతపాపా! నామనస్సు ఒకతుమ్మదయై నీపాదపద్మం వ్రాలి కర్ణికపై నిలిచి భక్తిమకరందాన్ని పానం చేస్తుండాలి. వాత్సల్యమూర్తీ! నావాక్కులు సుధాధారలై మధురభావల జాలులో ప్రవహించి నీపవిత్రస్తోత్ర సముద్రంలో లీనమై చరితార్థాలు కావాలి. మహైశ్వర్య ప్రదా! నాహస్తపద్మాలు నీ సమస్తోపచారాలతో పరిమళించి బాగుగా వికసించాలి.
నాగేంద్రభూషణా! నా కర్ణపుటాలు నానా మహిమాన్వితాలైన నీకథామృత ఫలాలు నిండుగా పట్టుకొని నిరంతరం ప్రకాశిస్తూ ఉండాలి. మహాదేవ! నామనస్సు సహస్రారవిందంలో సాంబమూర్తివై వెలుగొందే నిన్ను ధ్యానిస్తూండాలి. కామ్యదా! నా కన్నులలోని చూపు భ్రూమధ్యంలో నిలిచి నీఅనంతరూప వైభవాన్ని దర్శిస్తూండాలి

మోహజాలము
 
యథాబుద్ధి శ్ముక్తౌ రజతమితి కాచాశ్మని మణి
ర్జలే పైష్టే క్షీరం భవతి మృగతృష్ణాను సలిలం।
తథా దేవభ్రాంత్యా భజతి భవదన్యం జడజనో
మహాదేవేశం త్వాం మనసి చ సమత్వా పశుపతే॥

గిరిజామనోహరా! శంకరా! మానవులు పెక్కుభ్రమలలోపడి నిజవస్తుతత్వం తెలుసుకోలేక మాయావస్తువుల వెంబడి నశించిపోతున్నారు. మద మోహ మాత్సర్య మాయాగ్రస్తులైన మందమతులు భ్రమలోపడి సత్యం తెలుసుకోలేక పోతున్నారు. భోగలాలసులై క్షుద్రదేవతలను ఉపాసించి ముక్తిప్రదావతవైన నిన్నుమరచి అల్పసుఖాలకై అల్పులను ఆశ్రయిస్తున్నారు. అదేశాశ్వతం అనుకుని మురిసిపోతున్నారు. శివా! నిన్ను భజించినవారు నిరుపమాన నిర్మలానందం పొందుతారు.

ఆత్మపుష్పాలు
గభీరే కాపారే విశతి విజనే ఘోరవిపినే
విశాలే శైలేచ భ్రమతి కుసుమార్థం జడమతిః।
సమర్ప్యైకం చేతస్సరసిజ ముమానాథ భవతే
సుఖే నావస్థాతం జన ఇహ న జానాతి కిమహో॥

ఉమానాథా! సాయీశ్వరా! సత్యశివసుందర మహేశ్వరా! నీకు మానసాంబుజాలు సమర్పించలేని మందబుద్దులు బాహ్యపూజకై ఎంత ఆడంబరం చేస్తున్నారు. నీకు సహస్ర సారసార్చన చేయాలని, లోతైన సరోవరాల్లో దిగి, తీగలు తెంచి ఎన్నో తామరపూలు తెంచుకుని వస్తున్నారు. లక్షబిల్వార్చనకని అడవులలోకి వెళ్ళి లేతలేత మారేడుకొమ్మలను తెచ్చి గుట్టలు పోస్తున్నారు. క్షీరాభిషేకాలని లేగదూడల మూతులు బిగించి పాలన్నీ బానలకొద్దీ పిందుకవస్తున్నారు. పాపం! వారికి నీవు భావప్రియుడవనీ, ఆత్మారాధన అంటే ఇష్టమనీ తెలియదు.చెప్పినా వినిపించుకోరు. మానసోద్యానవనంలో పూచిన నాలుగు చిన్నిగుణాలనే పూలు నీకు సమర్పిస్తే నీవెంత సంతోషిస్తావో తెలియదు.

0 comments

Post a Comment