Content feed Comments Feed

నీభక్తుడను
దురాశాభూయిష్టే దురధిపగృహద్వారఘటకే
దురంతే సంసారే దురితనిలయే దుఃఖజనకే।
మదాయాసం కిం నవ్యపనయసి కస్యోపకృతయే
వదేయం ప్రీతిశ్చేత్తవ శివ కృతార్థాః ఖలు పయమ్॥

ఓశివా! భక్తవత్సలా! దీననాథ! నేను ఈభవసాగరంలో పడిపోయాను. ఈ జంబాలకూపంలో దుర్జనులతోడి దుర్మార్గాలు, దురాశాలతలు నన్ను పాశబద్దుణ్ణి చేస్తున్నాయి. దుష్ట దుర్మదాధికారుల గృహాలు, గృహాలయందు యాచనా విహారాలు, చింతలు పంతలు నన్ను బాధిస్తున్నాయి. సారహీన సంసార సాగర తరంగాలు భయంకరంగాలేచి నన్ను భీతిల్లజేస్తున్నాయి. పాపవాగుర దుఃఖాలతో ఆచ్చాదితములైన ఊబిప్రవాహాలు నన్ని లోనికి లాక్కుపోతున్నాయి.
ప్రభూ! ఇందులో కూలిపోతున్నాను. విధి నన్నిలా చేశాడు. ఆవిథి నీకు భక్తుడని వానిమాటలు సాగిపోయేలా చేస్తున్నావు. న్రహ్మపై ప్రీతిచే నామొర వినికూడా ఉపేక్షవహిస్తున్నావు. భక్తులందరిపైన నీకు వాత్సల్యమే. బ్రహ్మ చేష్టలు, విన్నపాలు ఆలకించినవాడవు ఇవాళకాకపోయినా రేపయినా నాకోరికలు మన్నిస్తావని నాకు నమ్మకం కలుగుతోంది. దురాశవలన దుఃఖం, దుఃఖం వలన పాపం, పాపం వలన పతనం కలుగుతున్నాయి. కనుక శివా! నాకు దురాశాలేకుండా చేయి.

మానసమర్కటం
సదా మోహాటవ్యం చరతి యువతీనాం కుచగిరౌ
నట త్యాశాశాఖ స్వటతి ఝటితి స్వైరమభితః।
కపాలిన్ భిక్షోమే హృదయ కపి మత్యంతచపలం
దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో॥

ఆదిభిక్షూ! శంకరా! నామనస్సు చాలా చపలపమైనది. అదికోతి వంటిది. దానిని నీవే సరైనమార్గంలో పెట్టాలి. ఈ నామానసమర్కటం మోహకారణమైన చెరకుతోటలవంటి భోగాలవైపులు పరుగులు తీస్తుంది. కామగుణవర్థకాలైన కామీనీ కుచాద్రులపై తైతక్కలాడుతానంటుంది. ద్వేషరోషలోభాదులనే వృక్షశాఖాగ్రాలపైకి ఎగబ్రాకి కోతికొమ్మచ్చు లాడుతుంటుంది. శృంగారరస ప్రవాహాలలోని సుడిగుండాలలోదూకి మునిగి తేలుతుంటుంది.
ఇది చాలా చపలస్వభావ. దీనిని నాదగ్గర ఉంచుకోలేను. దీనితో వేగటం చాలాకష్టం. మంచిమాట ఒక్కటీ వినదు. నీమాటయితే వింటుంది. నీభిక్షుకవేషానికి తగినట్లుగా బాగా ఉంటుంది. భక్తి అనే తాడుతో బంధించి నీకు ఇస్తాను. తీసుకుపో. నాకష్టాలు తీర్చినవాడవవుతావు.

మానస పటకుటీరముధృతి స్తంభాదారాం దృఢగుణనిబద్దాం సగమనాం
విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిదివస సన్మార్గఘటితాం।
స్మరారే మచ్చేతః స్పుటపటకుటీం ప్రావ్య విశదా
జయస్వామిన్ శక్త్యాసహ శివగణైస్సేవిత విభో॥

ఈశ్వరా! సాయీశ్వరా! దీనబాంధవా! నామానసం ఒకపటకుటీరంగా దిద్ది తీర్చాను. ఇందు నీవు ప్రమధగణంతో, పార్వతీదేవితో వచ్చి నివాసం చేయవచ్చు. రా! స్వామీ! రా! ఆహ్వానిస్తున్నాను. ధైర్యం అనే స్తంభాలు గట్టిగా నిలబెట్టాను. గుణాలు అనే తాళ్ళతో గట్టిగా బిగించికట్టాను. గుడారం ఏర్పాటు చేశాను. దానిలో ద్వాదశపద్మాలతో అలంకృతమైన తెరలలో గదులు ఏర్పరచాను. కుటీరాన్ని ప్రతిదినం నిర్మలగంగాతీరభూములలో వికసించిన మందారాలుతెచ్చి అలంకరిస్తున్నాను. భక్తి అనేదూది ఏకించి మెత్తమెత్తని ఆసనాలు, శయ్యలు ఏర్పాటు చేశాను. ఇది అన్నివిధాలా అర్హతగలది. దృఢమైనది. నీకుయోగ్యమైనది. నీవు వచ్చి నన్ను చరితార్థుణ్ణి చేయవలసినది.

మన స్తస్కరుడు 
ప్రలోభాద్యై రర్థాహరణపరతంత్రో ధనిగృహే
ప్రవేశోద్యుక్తస్సన్ భ్రమతిబహుదా తస్కరపతే।
ఇమం చేతోశ్చోరం కథ మిహ సహే శంకర విభో
తవాధీనం కృత్వామయి నిరపరాథే కురు కృపామ్॥

పరమేశ్వరా! పాపహరా! శంకరా! నామనస్సు వట్టి దొంగబుద్ధి కలది. ఈదొంగ గొల్ల‌ఇండ్లలో వెన్నలు తినివస్తుంది. చిత్తహరా! ఈదొంగ మానినీమణుల మాణిక్యహారాలు కాజేస్తుంటుంది. గుణహరా! ఈదొంగ ధనవంతులెంత జాగ్రత్తగా ఉన్నా వారికన్నుగప్పి మోసంచేసి ప్రతివస్తువునూ దోచేస్తుంటుంది. దేవరా! ఈదొంగ ఎదురుపడి పలకరించినవారిని నిలువుదోపిడీ చేస్తుంటుంది. ఈఖలబుద్ధిని నీవేమార్చాలి. మంచిమార్గంలో పెట్టాలి. ఈదొంగబుద్ధులను దారిలోపెట్టే సమర్థుడవు నీవుతప్ప మరెవ్వడూలేడు. వీడు నాస్వాధీనంలో ఉండటంలేదు. నీవు తస్కరాధిపతివి. వారిని అదిలించి మంచిమార్గంలో పెట్టే సమర్థుడవు. నామొరవిని మర్యాద కాపాడు ప్రభూ! నీకాళ్ళు పట్టుకుంటాను.

0 comments

Post a Comment