Content feed Comments Feed

ఇంద్రియసిథ్థి 
కదా నా త్వాం దృష్ట్వా గిరిశ తవ భహ్యాంఘ్రియుగళం
గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్।
నమాశ్లిష్యాఘ్రాయ స్పుట జలజగంధాన్ పరిమళౌ
నలభ్యాం బ్రహ్మాద్యై ర్ముదమనుభవిష్యామి హృదయే॥

శివసుందర సాయీశా! మహేశా! నాఇంద్రియాలు నీసేవ ముదమార ఎప్పుడు చేస్తాయోకదా? నాహస్తాలు సంతోషంతో పొంగిపోయి ఎప్పుడు నీచరణారవింద సంవాహన చేస్తాయో? నాశిరస్సు ఎప్పుడు నీపాదపద్మాల మ్రోలవ్రాలి పవిత్ర పాదధూళిని స్పృశిస్తుందో? నానేత్రాలు ఏనాడు నీపాదపద్మ సౌందర్యం కనులారా తిలకిస్తాయో? నామనస్సు చిదాకాశంలో నీపరమపద సౌవర్ణశిఖరం దర్శించి ఆదృష్టిని అలానే ఎప్పుడు నిలుపుకుంటుందో?

కానుక
 కరస్థే హేమాద్రౌ గిరిశ నికటస్థే ధనవతౌ
గృహస్థే స్వర్భూజామర సురభి చింతామణి గణే।
శిరస్స్థే శీతాంశౌ చరణయుగళస్థే౭ఖిలశుభే
కమర్థం దాస్యే౭హం భవతు భవదర్థం మమమనః॥

శివా! నీకు ఏదైనా విలక్షణమైన సరిక్రొత్త కానుక ఇవ్వాలని మనస్సు మారాంచేస్తున్నది. ఏమియ్యగలను.ధనువు ఇచ్చుకుందామంటే నీచేతిలో బంగారుకొడ మేరువు ధనువై ప్రకాశిస్తున్నది. పోనీ వెండిబంగారాలు ఇద్దామంటే కుబేరుడు నిత్యం పంపిస్తున్నవేకదా! నీకు చల్లగా ఉండే ఏపుష్పరసాలు సమర్పిద్దామన్నా శిరస్సుపై చంద్రుడు పండువెన్నెలలు కుమ్మరిస్తున్నాడాయె. నీకు సేవలుచేయడానికి నాకుమారీమణిని ఇద్దామంటే సర్వవిథాలా సర్వవేళలా సర్వమంగళ నిన్ను సేవిస్తున్నది. ఫలాలు ఇద్దాము అంటే భవనం ముందువెనకా అన్నీ కల్పవృక్షాలే. పాలిద్దామంటే పెరటినిండా కామధేనువులే. శంకరా! కొత్తది ఏమి ఇయ్యగలను? అన్నీ నీవిదివరకు అనుభవించినవే. మనస్సు అనే విచిత్రవస్తువు ఉన్నది. అది అర్పిస్తాను స్వీకరించు ప్రభూ!

ముక్తిదాత
 సారూప్యం తవపూజనే శివమహాదేవేతి సంకీర్తనే
సామీప్యం శివభక్తిదుర్యజనతా సాంగత్యసంభాషణే।
సాలోక్యం చ చరాచరాత్మక తనుధ్యానే భవానీపతే
సాయుజ్యం మమసిద్దమత్రభవతి స్వామిన్ కృతార్థోన్మ్యహమ్॥

సాయీశ్వరా! ముక్తిదాతవంటే నీవేదేవా! నాల్గు ముక్తులూ ఒకేసారి ప్రసాదించగలవు స్వామీ! దయాళూ! నీక్షేత్రానికి వచ్చి నీభక్తులతో స్నేహంచేసుకున్నంత మాత్రాన సాలోక్యముక్తిని ప్రసాదిస్తావు. శివా! మహాదేవా! సాయీశ్వరా! తాండవమూర్తీ! నటరాజా! అని నోరారా పిలిచినంతమాత్రాన సామీప్యానికి జేర్చుకుని సామీప్యముక్తిని అనుగ్రహిస్తావు. నీరూపంచూస్తూ నీకభిషేకం చేస్తూ నిన్ను పరికిస్తున్నమాత్రాన సంతోషించి సారూప్యముక్తిని చేకూరుస్తావు. నిన్ను మనసారా ధ్యానిస్తూ ఆత్మపీఠంపై ప్రతిష్టించుకుంటేచాలు సాయుజ్యముక్తిని అందిస్తావు.

0 comments

Post a Comment