Content feed Comments Feed

ఏకైక ఫలప్రదాత

సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్రఫలదాః
సమన్యే స్వప్నేవా తదనుసరణం తత్కృతఫలమ్।
హరిబ్రహ్మాదీనాం అపి నికటభాజా మసులభం
చిరంయాచే శంభో శివ తవపదాంభోజ భజనమ్॥

పరమశివా! దయాసముద్రా! అక్షయ వరప్రదాతా! భక్త చింతామణీ! కామధేనూ! నీపాదారాధన విడిచి అల్పఫలాలు ఇచ్చే క్షుద్రదేవతల పాదాలుపట్టి అర్థించలేను. భ్రమలోపడి మణులను వీడి గాజుపెంకులవెంట పరిగెత్తలేను. పాలు ఇచ్చే కామధేనువును కాదని గొడ్డుటావువెంట కుండగొని పోవలేను. హరిబ్రహ్మాదులకే లభ్యములుకాని నీపవిత్ర పాదపద్మాలు నాహృదయచక్రంలో నిలుపుకొని నిత్యం ధ్యానం చేసుకొంటాను. మహాదేవ! నన్ను దయజూడు. నీవు ఒక్కడవే శాశ్వతుడవు. నిన్నువేడుకుంటున్నాను. జీవన్ముక్తిని  ప్రసాదించు.

పశువు
స్మృతౌ శాస్త్రేవైద్యే శకున కవితాగాన ఫణితౌ
పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యే ష్వ చతురః।
కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే
పశుం మాం సర్వజ్ఞ ప్రధిత కృతయా పాలయవిభో॥

సర్వజ్ఞా! సర్వేశ్వరా! పరమశివా! పశుపతీ! నేను నిజంగా పశువునే. ఏమీ నేర్చుకోలేదు. ధర్మశాస్త్రాలను ఎరుగను. భాషావైదుష్యాలు లేవు. వైద్యవిద్య రాదు. శాస్త్రపాండిత్యమూ, సంగీతసాహిత్యాలు, పురాణాలు, మంత్రాలు ఏవీ తెలియవు. హాస్య శృంగారరస ప్రసంగాలు చేయటం చేతకాని పని. నీవు అన్నీ తెలిసినవాడవు. ధీనబాంధవుడవు. అనాథనాథుడవు. పశుతుల్యుండనైన నన్ను నీవేరక్షించాలి. నీవుకాదన్న వేరేదిక్కులేదు. అన్యధాశరణం నాస్తి త్వమేవ శరణం మమ.

శుష్కతర్కాలు
ఘటోవా మృత్పిండో౭ప్యరుణురపిచ ధూమోగ్నిరచలః
పటోవా తంతుర్వా పరిహరతి కిం ఘోరశమనమ్।
వృధా కంఠక్షోభం వహసి తరసా తర్కవచసా
పదాంబోజం శంభోర్బజ పరమసౌఖ్యం వ్రజసుధీః॥

ఓపండితులారా! ధీరాగ్రగణ్యులారా! హేతువాద తర్కాలు కేవలం కంఠశోషను ఫలంగా మిగులుస్తాయి. అవి మృత్యువును జయించేవికావు.ఆయుఃకాలం వ్యర్థంచేయకుండా తనువులో బలం ఉన్నప్పుడే మృత్యుంజయస్వామి పాదపద్మాలను ఆరాధించండి. ఆఈశ్వరనామ స్మరణమే నీకు మేలుచేయునది.

0 comments

Post a Comment