Content feed Comments Feed

జీవన్ముక్తి
కరోమి త్వత్పూజాం సపది సుఖయో మే భవ విభో
విదిత్వం విష్ణుత్వం దిశసి ఖలు తస్యాః ఫలమితి।
పునశ్చత్వాం ద్రష్టుం దివి భువి వహన్ పక్షిమృగతా
మదృష్ట్వా తత్ధేదం కథమిహ సహే శంకరవిబో॥

ఓసాయీశ్వరా! భక్తకల్పతరువా! నీదయ అపారం. అడిగినదానికంటె అధికంగా ఇస్తావు. ఎంతపెద్దవరం అయినా వేగమే ఇయ్యగలవు. వీడు నన్నుగూర్చి బాగాభజించాడు అని విష్ణుపదవి ఇచ్చావనుకో నేను వరాహమునై నీపాదపద్మములు వెతకలేను. వీడు బాగా ధ్యానం చేశాడు బ్రహ్మపదవి ఇచ్చావనుకో హంసనై నీశిరోజాగ్రం ఆకాశమంతా వెతికిపట్టుకోలేను.
నీకేమి నీవేవైనా ఇస్తావు. కానీ నేను దక్కించుకోవద్దూ. ఆగొప్పలు నాకెందుకులేగానీ ఇసుమంత జీవన్ముక్తి ఇమ్ముచాలు. నాకు దురాశలులేవు.

శివవైభవం
 కదా వా కైలాసే కనకమణి సహగణై
ర్వసన్ శంభో రగ్రే స్పుటఘటితమూర్థాంజలి పుటః।
విభోసాంబ స్వామిన్ పరమశివ పాహీతి నిగదన్
విధాతౄణాం కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖతః॥

మహాదేవా! నీమహావైభవం మహైశ్వర్యం నాకనులారా చూడాలని ఉంది స్వామీ! ఆమథురక్షణం ఎప్పుడు అనుగ్రహిస్తావోకదా! ఆపరిశుద్ధ పరిశుభ్ర ధవళ ధగద్ధగల కైలాసాద్రి, ఆఆద్రిపై మధురమంజుల మందారపుష్పవాటిక, ఆవాటికమద్యంలో మణిమయ మహామాణిక్య రత్నమందిరం. ఆమందిరప్రాంగణంలో మెరిసిపోయే సహస్రస్తంభమంటపం. ఆమంటపంలో దేవగాంధర్వ ఆనందమంగళధ్వని.
పార్వతీపతీ! పాహిపరమేశ్వరా! అనే నారదాదుల నందిస్తోత్రస్రవంతి. మధుర మహిత లలిత కీర్తనలు. దేవకోటి సస్తవం. వీటితో నిండిన నీసంస్థాన మహావైభవంచూస్తూ నీసభలో సభ్యుడిగాఉండి యుగయుగాలనూ క్షణాలుగా గడపాలని మహాకాంక్షప్రభూ! కటాక్షించు కళ్యాణగుణధామా!

శివవిభూతి

స్తవైర్బ్రహ్మాదీనాం జయజయవచోభి ర్నియమినాం
గణానాం కేళీభి ర్మదకలమహూక్షస్య కకుది।
స్థితం నీలగ్రీవం త్రినయన ముమా శ్లిష్టవపుషం
కదా త్వాం పశ్యేయం కరధృతమృగం ఖండపరశుమ్॥

సాయీశా! మహేశా! నీవైభవ శివమూర్తిని దర్శించాలని ఉన్నది.  బ్రహ్మాది దేవతా సమూహాలు బారులుతీరి నిలువబడి 'జయజయ‌' ద్వానాలు చేస్తుండగా, నీభూతప్రేత ప్రమథగణాలు శివంకరముగా నాట్యంచేస్తుండగా, నందీశ్వరుడు మోరపైకెత్తి బ్రహ్మాండం మారుమ్రోగేలా రంకెలు వేస్తుండగా, ఈమహాసంరంభం చూచి గౌరీదేవి సంభ్రమించి నిన్ను కౌగిలించుచుండగా, నీకంఠముపై మెరిసే హరినీల కాంతిసౌందర్యం చిందుతుండగా, నీకన్నులు వింతసోయగాలు వెలయిస్తుండగా, నీవుమహదానందంగా ఊరేగుతున్న ఉత్సవశోభ దర్శించాలని తీవ్రకాంక్షదేవా! ఆఆదృష్టం నాకున్నదంటావా? ఎప్పుడు కలుగజేస్తావో! అశుతోషా!

0 comments

Post a Comment