Content feed Comments Feed

దర్శనం 
త్వత్పాదాంబుజ మర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం
త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచేవిభో।
వీక్షాం మే దిశ చాక్షుషీం సకర్ఉణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం
శంభో లోకగురో మదీయ మనసః సౌఖ్యోపదేశం కురు॥

దేవేంద్రపూజితా! నీపాదపద్మాలు నిత్యం అర్చిస్తున్నాను. బ్రహ్మాది దేవసేవితా! నీదివ్యరూపం చిత్తంలో నిత్యం ధ్యానిస్తున్నాను. విష్ణుదేవవినుతా! నిర్మలమతితో నీకథాశ్రవణం నియతితో చేస్తున్నాను. కవీంద్ర సంసేవితా! నీచరణ నీరజాలు శరణాలని నిత్యం వేడుకుంటున్నాను.
సదుపదేశాలుచేసే జగద్గురూ! దేవముని సిద్ధ సాధ్యాదులు అర్థించే నీదర్శన స్పర్శన భాషణానుగ్రహాలు అందించి నన్ను కరుణించు కారుణ్యమూర్తీ! నీకు శతకోటి అభివందన నందన చందనాలు.

ఏమి అర్పింతు 
వస్త్రోద్ధూతవిథౌ సహస్రకరతా పుష్పార్చనే విష్ణూతా
గంధే గంధవహాత్మతాన్నపచనే బర్హిర్ముఖాద్యక్షతా।
పాత్రే కాంచన గర్భతాస్తిమయిచే ద్బాలేందు చూడామణే
శుశ్రూషాం కరవాణి తే పశుపతే స్వామిన్ త్రిలోకీ గురో॥

పశుపతీ! త్రిలోకైకపతీ! శివా! దిగంబరా! వ్యాఘ్రచర్మాంబరా! నీకు వస్త్రయుజ్ఙ్మం సమర్పించాలి అంటే వేయిచేతులు కావాలి. వేయిచేతులవేల్పు సూర్యుడే నీకు సమర్థుడు. చంద్రకళాధరా! కళార మనోహరా! నీకుపూజ చేయాలంటే సహస్రకమలాలు కావాలి. కమలలోచనుడైన విష్ణువే సంపాదింప సమర్థుడు. ఒకటి తక్కువైతే తనకంటినేఇచ్చి పూజ పరిపూర్తి చేసిన సమర్థుడు.
శ్రీకంధరా! నీకు పరిమళభరిత సుగంధరవ్యాలు సమర్పించాలి అంటే సదాగతిగల గంధవహుడైన వాయుదేవుడే సమర్థుడు. ప్రభూ! విషాహారా! నీకు సరసాన్నాలు నైవేద్యం హృద్యంగా పెట్టాలంటే అగ్నిదేవాదులకు అద్యక్షుడైన దేవేండ్రుడే సమర్థుడు. హవిర్భాగాలు అగ్నిద్వారా జలాదులు మేఘాలద్వారా సంపాదించి సమర్పింపగలరు. స్వామీ! బ్రహ్మాండసార్వభౌమా! నీకు అర్ఘ్యపాద్యాదులకు పాత్రలు సమర్పింప సర్వసృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే సమర్థుడు. అతడు ఏదైనా సృష్టించి అర్పించగలడు.

పరమోపకారి
 నాలంవా పరమోపకారక మిదం త్వేకం పశూనాంపతే
పశ్యన్కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుమ్।
సర్వామర్త్య పలాయనౌషధ మతిజ్వాలాకరం భీకరం
నిక్షిప్తం గరళం గళేన గిశితం నోద్గీర్ణమేవ త్వయా॥

పరమశివా! పరమోపకారకా! లోకాలపై ఎంత జాలిగదయ్యా నీకు.
సముద్రమధనం జరుగుతుంటే మహాకాలకూటం నిప్పులుగ్రక్కుతూ పొంగిపొర్లివచ్చిందే. ఆభయంకర ఉద్ధృతదృశ్యం చూచి దేవతలందరూ ఇకప్రాణాలు నిలవవని భయపడూతుంటే ప్రాణాతురులైన వారిని రక్షించాలని ఈవిషం స్వీకరించావా! ఈవిషప్రభావం వలన లోపలిలోకాలు కాలిపోతాయని మింగలేదా! బయటిలోకాలు భస్మమైపోతాయని బయటికికక్కలేదా! లోకక్షేమంకోసం ఆవిషాన్ని క్రక్కలేక మ్రింగలేక పుక్కిటనే పట్టిఉంచావా దేవా! లోకాలకోసం ఎంతటికష్టాన్ని భరిస్తున్నావయ్యా! శంకరా! గరళకంఠా! సాయీశ్వరా! శతనమస్కారాలు.

0 comments

Post a Comment