Content feed Comments Feed

అలా మహాజ్ఞానులకే కాక అజ్ఞానులకు, నిరక్షరాస్యులయిన వారికి కూడా మొదట అవసరమైనది ఓంకారమే. ఎవ్వరికయినా అక్షరాభ్యాసం "ఓం నమః శివాయ సిద్ధం నమః" అనే మొదలుపెడతారు. ఆ విధంగా ప్రతిమనిషికీ మొట్టమొదట నేర్పే అక్షరమే ఓంకారం. ఈ ఓంకారాన్ని అందరూ ఉచ్చరింప కూడదని కొందరంటారు. కాని ఈ అక్షరాభ్యాస సంప్రదాయమే ఓంకారం విషయంలో అలాంటి భేదాభిప్రాయం తగదని చెప్తోంది. ఆయా సంప్రదాయాలను బట్టి అక్షరాభ్యాసం "ఓం గణేశాయనమః" అని కొందరు, "ఓం నమో నారాయణాయ" అని కొందరు చేయటం ఉంది కాని మొదట ఓంకారాన్ని చెప్పే విషయంలో మాత్రం తేడాలేదు. అలా ఓంకారం అన్ని సంప్రదాయాల వారికి మొదటి అక్షరం. భగవద్గీతలో "అక్షరం బ్రహ్మ పరమం" అని సూచితమైనదే సర్వులకూ గ్రాహ్యం.

కృష్ణుడు అర్జునునకు ఉపదేశించటం బట్టి, యముడు నచికేతునకు ఉపదేశించటం బట్టి ప్రణవోచ్చారణకు వర్ణాశ్రమ భేదాలు లేవని, శివుడు మృగశృంగుని భార్యలకుపదేశించటం బట్టి ఓంకారోపదేశానికి లింగభేదం లేదని, గరుడపురాణంలో వైకుంఠాన గరుత్మంతునకు సాక్షాన్నారాయణుడుపదేశించుట బట్టి మానవేతరులకు సైతం ఓంకారం గ్రాహ్యమే అని తెలుస్తుంది. కాబట్టి వీరు వారనక సర్వులూ ఓంకారాన్ని స్మరిస్తూ ఐహిక పారమార్థిక ప్రయోజనాలన్నీ పొందవచ్చు. కాబట్టే "నిరక్షర స్యాపి తు యస్య కుక్షౌ - బ్రాహ్మైవ చా భాతి స ఏవ సాక్షర:| సర్వాక్షర స్యాపి తు యస్య చిత్తే - బ్రహ్మైవ నా భాతి సవై నిరక్షరః|. ఎవరి హృదయంలో అక్షర స్వరూప పరబ్రహ్మ అనగా ఓంకారం జరుగుతుందో వాడే అక్షర కుక్షి, అక్షరాస్యుడు. అట్టి ఓంకారం లేనివాడు ఎన్ని శాస్త్రాలు చదివిన వాడయినా నిరక్షరాస్యుడే" అని చెప్పబడింది.

సమస్త వాఙ్మయమూ ఓంకారం నుండి పుట్టినదే. నాభి నుండి బయలుదేరిన నాదం నోటి ద్వారా బయటకు వచ్చేలోగా అంతర్నాడీ చలనం బట్టి 12 శ్రుతి భేదాలతో నాభి, హృదయ, కంఠ, నాసికా, రసనాది స్థాయి భేదాలతో సప్త స్వరాలుగా వెలువడుతుంది. ఇదే సంగీత శాస్త్ర మంతటికీ కారణమయినది. ఆ స్వరముల పుట్టుకకే కారణమయిన నాదం ఓంకారం సంగీతమునకు మూలమౌతున్నది. ఓంకారం వేదాల సారం. ఉపనిషత్తులన్నీ దీని మహిమను గానం చేస్తున్నాయి. యోగశాస్త్రం దీనినుపాసిస్తోంది. ఇది పరమేశ్వరుని వలె అవ్యయము, నాశరహితము, ఏకాక్షరము, లింగ విభక్తి వచన రహితము, సర్వగర్భము, అతి గంభీరము. సమస్త బ్రహ్మాండం దీనియందిమిడి ఉంది. అ+ఉ+మ్ = ఓం. ఓంకారంలోని అ-ఉ-మ్‌లు త్రిమూర్తులు, త్రికర్మలు, కాలత్రయ, గుణత్రయాది సకల త్రిపుటి సముదాయానికి ప్రతీకలు.

ఓం అనేది అంగీకార సూచకం. అనాదిగా ఋషివరుల సదస్సులందు అందరి ఆమోదం తెల్పుట ఓంకారం పల్కటం ద్వారా జరిగేది. ఒక ప్రతిపాదనను అంగీకరించటమంటే అందరూ కేవలం చేతులెత్తటం కాదు. దానితో బాటు ఓంకారం పల్కటం మన సంప్రదాయం. ఆ ప్రతిపాదన, తీర్మానము, సక్రమంగా అమలు జరుగుటకు కేవలం మనుష్య బలం అందించటమేగాక ప్రణవ శక్తి ద్వారా పరిపూర్ణ దైవ బలం సమకూర్చటమౌతుంది. కాబట్టి ఈ మన సంప్రదాయం గుర్తించి అన్ని సమావేశములందూ తీర్మానాలను ఓంకారంతో ఆమోదింపజేయటం ఆరంభించాలి. ఆంధ్రవాచ స్పత్యాది నిఘంటువులలో కూడా సమ్మతి అనుదానికి సూచకంగా ఓంకారం చెప్పబడింది. విజ్ఞులు ధార్మిక సంస్థల, దేవాలయాదుల సమావేశాలలో ఆరంభించి క్రమంగా అవకాశమున్న అన్ని సమావేశాలలో ఈ సత్సంప్రదాయాన్ని ప్రవేశపెట్టాలి.

స్వాధ్యాయ బ్రాహ్మణం 11 వ అనువాకంలో ఓంకారంతో భూర్భువస్వః అనే వ్యాహృతి త్రయం ఉచ్చరించుటచే వేద త్రయం పఠించిన వాడౌతాడని ఉంది. మనుస్మృతిలో మనువు కూడా ఓంకారాన్ని వేదత్రయాత్మకంగా చెప్పాడు. మనం వేదమంతా ఎటూ చదువలేము. కనీసం వేద త్రయాత్మకము, వేదమునకు మూలము, అయిన ఓంకారాన్ని స్మరిస్తూ ఆ వేదపఠనం గావించిన ఫలం కొంత పొందగల్గుతాము. ఈ ఓంకారోచ్చారణ కూడా "తైల ధారావ దచ్ఛిన్నం - దీర్ఘం ఘంటా నినాదవత్ ఆప్లుతం ప్రణవస్యాంతం - యస్తం వేద సవేదవిత్" నీళ్ళవలె విడివిడిగా కాక తైలధారలాగా అవిచ్ఛిన్నంగా, ఘంటానినాదం వలె దీర్ఘంగా ఎవడు పల్క గల్గునో వాడు నిజంగా వేద విదుడని చెప్పబడింది. కాబట్టి అలా ఉచ్చరించాలని గ్రహించాలి.

మరికొంత వచ్చే టపాలో...

0 comments

Post a Comment